కృష్ణా నదీ జలాల వివాదం మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఏపీ పిటిషన్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 100% స్థాపిత సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు తీవ్రంగా తగ్గిపోతున్నాయి. సాగునీటి అవసరాలకు, ఇతర ప్రయోజనాలకు ఏపీకి నీటి సరఫరా దెబ్బతింటోందని పిటిషన్లో పేర్కొన్నారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబీ) అధికార పరిధిని నోటిఫై చేయడంలో పురోగతి లేకపోవడమే సమస్యకు మూలమని ఏపీ వాదిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి రిజర్వాయర్లపై తెలంగాణకు అధికారం లేదని, అక్కడి నిల్వలు ఉమ్మడి నిల్వలని పిటిషన్లో స్పష్టం చేశారు.
జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే టిఎస్జెన్కోను శ్రీశైలం ద్వారా అదనపు నీటి విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే తెలంగాణ దీనిని పాటించలేదని ఏపీ ఆరోపిస్తోంది.
శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోనూ నీటి లభ్యత తగ్గిందని, దీంతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి నీటి అంశాలపై చర్చించారు.

